Thursday 29 July 2021

కోవిడ్‌ వ్యాక్సినేషన్‌లో టీచర్లకు ప్రాధాన్యత

కోవిడ్‌ వ్యాక్సినేషన్‌లో టీచర్లకు ప్రాధాన్యత

కోవిడ్‌ వ్యాక్సినేషన్‌లో టీచర్లకు ప్రాధాన్యత ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఆక్సిజన్‌ కాన్‌సన్‌ట్రేటర్లు కొత్త మెడికల్‌ కళాశాలలు త్వరగా భూ సేకరణ గణనీయంగా తగ్గిన యాక్టివ్‌ కేసులు


కోవిడ్‌ వ్యాక్సినేషన్‌లో టీచర్లకు ప్రాధాన్యత 


కోవిడ్‌ వ్యాక్సినేషన్‌లో టీచర్లకు ప్రాధాన్యత వీలైనంత త్వరగా వారికి పూర్తి చేయాలి.. కోవిడ్‌ నివారణ, నియంత్రణ, వ్యాక్సినేషన్‌పై సమీక్షలో సీఎం జగన్‌

వివిధ రాష్ట్రాల్లో కేసులు, వ్యాక్సినేషన్‌ తర్వాత పరిస్థితిపై అధ్యయనానికి కమిటీ తద్వారా రాష్ట్రంలో అనుసరిస్తున్న విధానంలో మార్పులు, చేర్పులకు అవకాశం
100 బెడ్లు ఉన్న ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ ప్లాంట్ల ఏర్పాటుకు చర్యలు

ఆ తర్వాత మిగిలిన ఆస్పత్రుల్లో ఏర్పాటుపై దృష్టి పెట్టాలి ప్లాంట్ల ఏర్పాటు ద్వారా వారికి 30 శాతం సబ్సిడీ వీటి నిర్వహణ కోసం జిల్లాల వారీగా ప్రత్యేకంగా సిబ్బంది నియామకం

ఆస్పత్రుల నిర్వహణలో కీలకమైన ఆక్సిజన్‌ ప్లాంట్ల నిర్వహణ, ఎలక్ట్రికల్, ఏసీ రిపేర్, ప్లంబింగ్‌తో పాటు ఇతర అనుబంధ వైద్య విభాగాల్లో నైపుణ్యాలను అభివృద్ధి చేయాలి. ఐటీఐ, డిప్లొమాల్లో ఇందుకు సంబంధించిన కోర్సులను ప్రవేశపెట్టాలి. తద్వారా నైపుణ్యం ఉన్న మానవ వనరుల సేవల కారణంగా ఆస్పత్రుల నిర్వహణ మెరుగ్గా ఉంటుంది. చాలా మందికి ఉద్యోగాలు వస్తాయి.  

కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో భాగంగా వీలైనంత త్వరగా ఉపాధ్యాయులకు టీకా ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. వచ్చే నెలలో పాఠశాలలను పునఃప్రారంభించనున్న నేపథ్యంలో ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. మే, జూన్, జూలై నెలల్లో ప్రైవేటు ఆస్పత్రులకు 43,38,000 డోసులు ఇస్తే.. కేవలం 5,24,347 మాత్రమే వినియోగించారని, ఈ వ్యాక్సిన్లను ప్రభుత్వానికి ఇస్తే వ్యాక్సినేషన్‌ ప్రక్రియ మరింత వేగంగా ముందుకు సాగుతుందన్నారు. దీనిపై మరోసారి కేంద్రానికి లేఖ రాస్తానని తెలిపారు. కోవిడ్‌ 19 నివారణ, నియంత్రణ, వ్యాక్సినేషన్‌పై బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వివిధ రాష్ట్రాల్లో కేసుల సంఖ్య, వ్యాక్సినేషన్, అనంతరం అక్కడ కోవిడ్‌ తీరు తదితర అంశాలపై అధ్యయనం చేసేందుకు ఒక కమిటీని నియమించాలని ఆదేశించారు. ఈ అంశాలపై కమిటీ అధ్యయనం అనంతరం నివేదిక సమర్పించాలని సూచించారు. తద్వారా కోవిడ్‌  నివారణకు రాష్ట్రంలో అనుసరిస్తున్న విధానాల్లో అవసరమైతే మార్పులు, చేర్పులు చేసుకునే అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు. ఈ సమీక్షలో సీఎం జగన్‌ ఇంకా ఏమన్నారంటే కోవిడ్‌ నియంత్రణ, వ్యాక్సినేషన్‌పై నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతున్న సీఎం జగన్‌ 

 

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఆక్సిజన్‌ కాన్‌సన్‌ట్రేటర్లు


ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఆక్సిజన్‌ కాన్‌సన్‌ట్రేటర్లు అందుబాటులో ఉంచాలి. కోవిడ్‌ నివారణ చర్యల్లో భాగంగా ప్రభుత్వం కొనుగోలు చేసిన కాన్‌సన్‌ట్రేటర్లు, డీ టైప్‌ సిలెండర్లు, ఆక్సిజన్‌ జనరేషన్‌ (పీఎస్‌ఏ) ప్లాంట్ల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. దీనికోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలి. 

జిల్లాల వారీగా నిర్వహణ కోసం ప్రత్యేక సిబ్బందిని నియమించాలి. జిల్లా విస్తీర్ణం, ఆస్పత్రుల సంఖ్యను బట్టి తగిన సిబ్బందిని ఏర్పాటు చేయాలి. వీరికి అవసరమైన శిక్షణ ఇవ్వాలి. ఏపీఎంఎస్‌ఐడీసీలో ప్రత్యేక సెల్‌ ఏర్పాటు చేయాలి. శిక్షణ అనంతరం వీరిని ఆస్పత్రి మేనేజ్‌మెంట్‌కు అప్పగించాలి. 

100 పడకలు ఉన్న ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ జనరేషన్‌ ప్లాంట్లు ఏర్పాటు చేయించే దిశగా చర్యలు తీసుకోవాలి. తర్వాత మిగిలిన ఆస్పత్రులపై దృష్టి పెట్టాలి. ప్లాంట్ల ఏర్పాటు ద్వారా వారికి ప్రభుత్వం తరఫున 30 శాతం సబ్సిడీతో పాటు విద్యుత్‌ చార్జీల్లో ఊరట కలిగిస్తున్నాం. వీటి నిర్వహణ కోసం ప్రత్యేకంగా సిబ్బందిని నియమించాలి. ఐటీఐ, డిప్లొమాలో ప్రత్యేక కోర్సులు ప్రారంభించాలి.  

 

కొత్త మెడికల్‌ కళాశాలలు త్వరగా భూ సేకరణ


నూతన మెడికల్‌ కళాశాలల కోసం పెండింగ్‌ ఉన్న చోట భూ సేకరణను త్వరగా పూర్తి చేయాలి. ఇందుకు సంబంధించిన పనుల ప్రగతిపై వచ్చే సమావేశంలోగా నివేదిక ఇవ్వాలి.  

16 కాలేజీల పనులపై పూర్తి వివరాలు అందించాలి. ఒకవేళ పనులు మొదలు కాకపోతే.. వెంటనే మొదలుపెట్టించి ఆ వివరాలతో సమగ్ర నివేదిక ఇవ్వాలి. వైద్య ఆరోగ్య శాఖలో నాడు–నేడు పనులపై ప్రజెంటేషన్‌ ఇవ్వాలి. 

 

గణనీయంగా తగ్గిన యాక్టివ్‌ కేసులు


రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్‌ కేసులు 20,965 ఉన్నాయని, పాజిటివిటీ రేటు 2.51 శాతం, రికవరీ రేటు 98.25 శాతం ఉందని అధికారులు వివరించారు. పాజిటివిటీ రేటు 3 కంటే తక్కువ ఉన్న జిల్లాలు 9.. 5 కంటే తక్కువ ఉన్న జిల్లాలు 3.. 5 కంటే ఎక్కువ ఉన్న జిల్లా ఒకటి అని తెలిపారు.  

ఆస్పత్రుల్లో 4,426 మంది, కోవిడ్‌ కేర్‌ సెంటర్లలో 2,349 మంది చికిత్స పొందుతున్నారని తెలిపారు. నెట్‌ వర్క్‌ ఆస్పత్రుల్లో 94.33 శాతం బెడ్లలో, ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో 75.25 శాతం బెడ్లలో ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స పొందుతున్నారని వివరించారు. తాజాగా 104 కాల్‌ సెంటర్‌కు 933 కాల్స్‌ వచ్చాయని తెలిపారు. 

రాష్ట్రంలో 2,04,17,764 డోసుల వ్యాక్సిన్లు పూర్తి అయ్యాయి. 1,03,24,702 మందికి సింగిల్‌ డోసు,  50,46,531 మందికి రెండు డోసుల వ్యాక్సినేషన్‌ పూర్తయింది.   

ఈ సమీక్షలో ఉప ముఖ్యమంత్రి (వైద్య ఆరోగ్య శాఖ) ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్‌ (నాని), వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

0 comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.